రేపు మేడారంలో మంత్రివర్గ సమావేశం!

సాధారణంగా తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరుగుతుంది. కానీ అదివారం మేడారంలోని పర్యాటక శాఖకు చెందిన హరిత గ్రాండ్ హోటల్లో మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. 

ముందుగా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మేడారంలో పర్యటించి సమ్మక్క సారలమ్మ గద్దేలను దర్శించుకొని పూజలు చేస్తారు. తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. 

అనంతరం మంత్రివర్గ సమావేశంలో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాట్లు గురించి చర్చిస్తారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఏపీతో జల వివాదాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మాట్లాడాల్సిన అంశాల గురించి చర్చిస్తారు.

అనంతరం సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ చేరుకుంటారు. రేపు రాత్రి తన బృందంతో కలిసి దావోస్ సదస్సుకు బయలుదేరుతారు. ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు జరుగబోయే సదస్సులో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా అమెరికా పర్యటనకు వెళ్తారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్, అమెరికా పర్యటనలు సాగుతాయి.