
ఫోన్ ట్యాపింగ్ కేసుని సిల్లీ డ్రామా... ట్రాష్... మున్సిపల్ ఎన్నికల కోసమే నోటీసు ఇచ్చారంటూ కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. గాంధీ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్తదే అయితే ముందు కల్వకుంట్ల కవిత అడుగుతున్న ప్రశ్నలకు, ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి. తనది, తన భర్త ఫోన్లు కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని కల్వకుంట్ల కవిత బహిరంగంగానే ఆరోపిస్తున్నారు కదా? ఆమెకు సమాధానం చెప్పకుండా మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?
శాసనసభ సమావేశాలు కనీసం 15-20 రోజులు నిర్వహించాలని పట్టుబడుతుంటారు. కానీ సమావేశాలు మొదలవగానే ఎదో కుంటిసాకుతో సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోతారు. కల్వకుంట్ల కవిత ఆరోపణలకు సమాధానం చెప్పలేరు. శాసనసభలో మాట్లాడే ధైర్యం లేదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న తీరుపై కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఒరిగేదేమీ లేదని తేల్చేశారు. ఈ విషయం కేటీఆర్, హరీష్ రావులకు కూడా బాగా తెలుసు కనుకనే ఇంత తీవ్రమైన ఈ కేసుని సిల్లీ డ్రామా అంటూ కొట్టిపడేస్తున్నారు?అనే సందేహం కలుగుతుంది.