కవిత సొంత కుంపటితో మాకేం ఇబ్బంది లేదు: బిజేపి

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న మండలిలో మాట్లాడుతూ తన రాజీనామాని ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ, “ఇప్పుడు ఓ వ్యక్తిగా బయటకు వెళతాను. భవిష్యత్‌లో ఓ శక్తిగా తిరిగి వస్తాను,” అంటూ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని చూచాయగా చెప్పారు. 

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు స్పందిస్తూ, “ఆమె పార్టీ పెట్టుకుంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. దానిపై మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఆమె పార్టీ పెట్టుకున్నా మాకేమీ నష్టం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు బిజేపి వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రం బిజేపి అధికారంలోకి వస్తుంది.

ఆమె ఆత్మాభిమానం దెబ్బ తింటే అది కల్వకుంట్ల కుటుంబ సమస్య తప్ప రాష్ట్ర ప్రజల సమస్య కానే కాదు. కేంద్ర ప్రభుత్వం తనను అన్యాయంగా జైల్లో పెట్టిందనేది పచ్చి అబద్దం. ఆమె అవినీతికి పాల్పడ్డారు కనుకనే జైలుకి వెళ్ళారు. బిజేపి ఎన్నడూ తన రాజకీయ ప్రత్యర్ధులపై ఈవిధంగా కక్ష సాధింపులకు పాల్పడదు,” అని అన్నారు.