29.jpg)
సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక శుక్రవారం సాయంత్రం ఎర్రవల్లి ఫామ్‌హౌసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈసారి సమావేశాలకు తాను హాజరు కావాలనుకుంతున్నానని కేసీఆర్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
శాసనసభ సమావేశాలలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి లేవనెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమాలు ఆరంభించాలని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఆ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. దాని కోసం ఇప్పటి నుంచే జిల్లాలో ఎక్కడికక్కడ ప్రజలతో, రైతులతో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
ఇదివరకు కూడా కేసీఆర్ తప్పకుండా శాసనసభ సమావేశాలకు వస్తారని ప్రచారం జరిగేది. కానీ రాలేదు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా? లేదా వచ్చే ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేసుకోవడానికి కేసీఆర్ ఇప్పటి నుంచే రంగంలో దిగబోతున్నారా? అనే విషయం శాసనసభ సమావేశాలు మొదలైతే తెలుస్తుంది.