అనిరుధ్ రెడ్డీ... నిధులు నీ జేబులో నుంచి ఇవ్వడం లేదు: కేటీఆర్‌

బుధవారం మూడవ మరియు చివరి దశ పంచాయితీ ఎన్నికలు జరుగబోతున్నాయి. గ్రామస్తులు బీఆర్ఎస్‌ సర్పంచ్‌లను ఎన్నుకుంటే ఆ గ్రామాలకి నిధులు, ఇందిరమ్మ ఇళ్ళు, సంక్షేమ పధకాలు ఇవ్వనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు  వైరల్ అవుతున్నాయి. 

వాటిపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ, “రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి తప్ప మీ జేబులో నుంచి ఇవ్వడం లేదని గుర్తుపెట్టుకుంటే మంచిది. మా అభ్యర్ధులు గెలిచిన గ్రామాలకు నిధులు ఎలా ఆపుతారో మేమూ చూస్తాం. నిధులు విడుదల చేయకపోతే ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు బైటాయించి ధర్నా చేసి మరీ విడుదల చేయించుకుంటాము.

అయినా ఎమ్మెల్యేగా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేసిన అనిరుధ్ రెడ్డి ఈవిధంగా ప్రజలను భయపెట్టడం ఏమిటి? తమ అభ్యర్ధులకు ఓట్లు వేసి గెలిపించకపోతే నిధులు ఇవ్వనని బెదిరించడం ఏమిటి? బీఆర్ఎస్‌ పార్టీ సర్పంచ్‌ల గ్రామాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే, వచ్చే ఎన్నికలలో గ్రామస్తులే కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెపుతారు,” అని కేటీఆర్‌ హెచ్చరించారు.