ఇమ్మడి రవికే బొమ్మ చూపారు... అభినందనలు: సీవీ ఆనంద్!

కొత్త సినిమాలను పైరసీ చేసి విడుదల చేస్తున్న ఐబొమ్మ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్‌ చేసినందుకు తెలంగాణ హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్, సైబర్ క్రైమ్‌ పోలీసులకు, డీసీపీ కవితకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘దమ్ముంటే పట్టుకోమని’ తెలంగాణ పోలీస్, సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఇమ్మడి రవి సవాలు విసిరాడు. అతని సవాలుని స్వీకరించి పట్టుకొని జైల్లో వేసినందుకు అభినందనలు తెలిపారు. 

అతనిని పట్టుకునేందుకు డీసీపీ కవిత నేతృత్వంలో సైబర్ క్రైమ్‌ టీమ్‌ రేయింబవళ్ళు చాలా కష్టపడిందన్నారు. అతని వలన తెలుగు సినీ పరిశ్రమకు చాలా నష్టం జరిగిందని, కనుక అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ చెప్పారు. 

ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకున్నాక కరేబియన్ దీవుల్లో సెయింట్ కిట్స్‌లో ఒంటరిగా ఉంటూ, అక్కడి నుంచి హ్యాకింగ్ ద్వారా, తన ఎజంట్స్ ద్వారా థియేటర్లలో విడుదల కాబోతున్న కొత్త సినిమాలను దొంగిలించి తన ఐబొమ్మ వెబ్‌సైట్‌లో పెట్టేవాడు. ఇతర సంస్థలకు, వ్యక్తులకు కూడా ఆ కాపీలు అమ్ముకునేవాడు. 

ఇటీవల అతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌ నుంచి వచ్చినప్పుడు సైబర్ క్రైమ్‌ పోలీసులు అతనిని కూకట్‌పల్లిలో అరెస్ట్‌ చేశారు. అతని అరెస్ట్‌ పట్ల తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ క్రైమ్‌ పోలీసులను అభినందిస్తున్నారు.