బీహార్‌లో ఓ అన్నా-చెల్లి కధ!

పొరుగు రాష్ట్రం ఏపీలో జగన్‌,షర్మిల, విజయమ్మ ఆస్తుల కోసం కీచులాడుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత కల్వకుంట్ల కుటుంబంలో హరీష్ రావు, కేటీఆర్‌-కవితల మద్య ఇలాగే పోరాటాలు జరగడం చూసి తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తలు దిగ్బ్రాంతి చెందారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీ ఓటమిపై కల్వకుంట్ల కవిత వారిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌- ఆర్‌జేడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. ఆర్‌జేడీ ఓటమికి కంగు తిన్న ఆ పార్టీ అధినేత తేజస్వీ యాదవ్‌ని ఆయన సోదరి రోహిణీ ఆచార్య తప్పు పట్టారు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత అన్నదేనన్నారు. తమ తండ్రి లాలూ ప్రసాద్ స్థాపించి అధికారంలోకి తెచ్చిన పార్టీని తన అన్న తేజస్వీ యాదవ్ నాశనం చేసేశాడని ఆమె ఆరోపించారు. 

అయితే కేసీఆర్‌, కేటీఆర్‌లాగ పద్దతిగా వ్యవహరించే అలవాటు లేనందున ఆమెను బూతులు తిడుతూ చెప్పుతో కొడతానని బెదిరించి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. ఈ విషయం ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు. నేను అడిగితే అన్నకు రోషం వచ్చింది కానీ రాష్ట్ర ప్రజలు, మీడియా అడిగితే ఏం సమాధానం చెపుతారని ఆమె ప్రశ్నించారు. ఈ పార్టీని, ఇంటిని, రాజకీయాలను తాను వదిలిస్తానని చెప్పారు.