ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌కి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ప్రకటించారు. అంతవరకు కేటీఆర్‌ని అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించారు. కనుక కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోగలుగుతారు.
ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ, ఈ కేసులో ఒప్పందం జరుగక ముందే రేసింగ్ నిర్వహణ కంపెనీకి రూ.46 కోట్లు చెల్లింపులు బ్రిటన్ పౌండ్ల రూపంలో జరిగాయని, నిబంధనలకు విరుద్దంగా ఈ చెల్లింపులకు కేటీఆరే బాధ్యుడని వాదించారు.
కాగా కేటీఆర్ తరపున వాదించిన పరముఖ్య న్యాయవాది సిద్ధార్ధ దవే వాదిస్తూ, ఈ వ్యవహారం మొత్తం చాలా పారాదర్శకంగానే జరిగిందని, నిధుల చెల్లింపు నిర్ణయం కేటీఆరేదే అయినప్పటికీ, నిబంధనల ప్రకారం జరపాల్సిన బాధ్యత సంబందిత అధికారులదే అని స్పష్టం చేశారు.
ఈ కేసుపై సుమారు మూడు గంటలకు పైగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ కె లక్ష్మణ్ ఈ కేసుకి సంబందించి పలు ప్రశ్నలు వేసి ఏజీ నుంచి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏజీ నుంచి పలు డాక్యుమెంట్ కాపీలు అడిగి తీసుకొని పరిశీలించారు.