తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి

మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్ళి భ్రమరాంభిక సహిత మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దైవ దర్శనం చేయించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజనతో శ్రీశైలం ఏపీకి దక్కినప్పటికీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మా కుటుంబానికి స్వామివారిపట్ల చాలా భక్తి, నమ్మకం ఉన్నాయి. అందుకే తరచూ ఇక్కడికి వస్తుంటాము. చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నాము. 

ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్‌‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీవారి పట్ల చాలా భక్తి, నమ్మకం ఉన్నాయి. కనుక నిత్యం వేలమంది తిరుమల స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు ప్రాధాన్యం ఉండేది కానీ గత (జగన్‌) ప్రభుత్వ హయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. 

కనుక తెలంగాణ భక్తులకు తిరుమలలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడుగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తెలంగాణ గుళ్ళు గోపురాలకు, కొత్తగా కళ్యాణ మండపాలు నిర్మించేందుకు టీటీడీ నిధులు కేటాయించాలని,” మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.