హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సినీ నటులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలకు ఊహించని కొత్త కష్టం వచ్చిపడింది. కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ కోసం వారిలో చాలా మంది ఇళ్ళను ప్రభుత్వం పాక్షికంగా తొలగించబోతోంది.
ఇప్పటికే ఆ ప్రాంతంలో సర్వే చేసి పలువురు ఇళ్ళపై మార్కింగ్ చేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కే జానారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (అల్లు అర్జున్ మామ), సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రెండు ప్రముఖ తెలుగు మీడియా సంస్థల అధినేతల ఇళ్ళ ప్రహారీ గోడలపై జీహెచ్ఎంసీ సిబ్బంది మార్కింగ్ చేశారు.
ఒమేగా ఆస్పత్రి సమీపంలో జానారెడ్డికి రెండు ప్లాట్స్ ఉన్నాయి. వాటిలో 43 అడుగుల వెడల్పున సుమారు 700 చదరపు గజాలు రోడ్ విస్తరణలో పోతుంది.
రోడ్ నం. 45,92 చౌరస్తా వద్ద బాలయ్యకు ఇల్లు ఉంది. దానిలో దాదాపు సగ భాగం రోడ్ విస్తరణలో కోల్పోబోతున్నారు. ఇంకా పలువురు ప్రముఖులు 25-50 శాతం వరకు తమ ఇళ్ళ స్థలాలను కోల్పోబోతున్నారు.
బంజారా హిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు 6 కిమీ పొడవునా రోడ్ విస్తరణ పనులలో 306 ఇళ్ళను పాక్షికంగా తొలగించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు గుర్తించారు. సర్వే జరిపించి ఇప్పటి వరకు 86 ఇళ్ళకు మార్కింగ్ చేశారు. మిగిలిన వాటికి త్వరలో సర్వే చేసి మార్కింగ్ చేస్తారు.
సామాన్య మధ్య తరగతి ప్రజల ఇళ్ళు కూల్చడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ రెండు ప్రాంతాలలో నివసిస్తున్న వారందరూ సినీ, రాజకీయ రంగాలలో హేమాహేమీలే. అందరూ చట్టబద్దంగా అనుమతులు తీసుకొని విలాసవంతమైన ఇళ్ళు నిర్మించుకున్నారు. పైగా ఈ ప్రాంతంలో చదరపు గజం ఖరీదు లక్షల్లో ఉంటుంది. కనుక వారందరినీ ఒప్పించడం చాలా కష్టమే. కానీ ఈ రోడ్ విస్తరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించినందున ఎట్టి పరిస్థితులలో వెనక్కు తగ్గబోదని స్పష్టమవుతోంది.