ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లి తండ్రులతో ముఖాముఖీ మాట్లాడారు. వారితో కలిసి భోజనాలు చేశారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మరికొందరు మంత్రులు వారితో కలిసి ఆటలు కూడా ఆడారు. వారి సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు పిల్లలకు పాఠాలు చెప్పారు.
సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలకు వెళ్ళగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హైస్కూలుకి వెళ్ళారు.
రాజకీయ నాయకులకు లేని క్రేజ్ సినిమా హీరోలకు ఉంటుంది. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తమ వద్దకు వచ్చి తరగతి గదిలో కూర్చొని మాట్లాడటం విద్యార్ధులకు ఓ గొప్ప మధురానుభూతి.
పిల్లలతో పోటీ పడుతున్నట్లు ఉపాధ్యాయులు, సిబ్బంది, పిల్లల తల్లి తండ్రులు పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీలు దిగారు. ఇక పిల్లల హడావుడి అయితే అంతా ఇంతా కాదు. ఆయన పక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పారు. ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
ఆయన చెప్పిన మంచి విషయాలన్నీ శ్రద్దగా విన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలని ధైర్యంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వారితో కలిసి భోజనం చేయడానికి నేలపై కూర్చున్నపుడు ఆయన పక్కన ఎదురుగా కూర్చునేందుకు విద్యార్ధులు పోటీ పడ్డారు.
కొందరు విద్యార్ధులు సినిమాలు చేస్తారా మానేస్తారా? అంటూ అమాయకంగా అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ వారిపై ఏమాత్రం కోప్పడకుండా నవ్వుతూనే చెయ్య మంటారా వద్దా? అని వారినే ఎదురు ప్రశ్నించారు. విద్యార్ధులు ఏం చెప్పారో అందరూ ఊహించుకోవచ్చు.
ఇక సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా తమ హోదాలని పక్కన పెట్టి వారితో హాయిగా కలిసిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వ్యసనానికి దూరంగా ఉంటూ చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ గర్వకారణంగా నిలవాలని హితవు చెప్పారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ కూడా సరదాగా ఉపాధ్యాయులతో కలిసి రోప్ పుల్లింగ్ ఆట ఆడారు. ఆ తర్వాత నేలపై కూర్చొని పిల్లలతో కలిసి భోజనం చేశారు.
ఈరోజు వారు ముగ్గురూ పాఠశాలలో పిల్లలకి, ఉపాధ్యాయులకి అందరికీ గొప్ప మధురానుభూతిగా నిలిచిపోయేలా చేశారని చెప్పవచ్చు.