పోలీస్ కస్టడీలో పట్నం.. ఏం చెపుతున్నారో?

బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిలగచర్ల దాడి కేసులు అరెస్ట్ అయ్యి జ్యూడిషియల్ రిమాండ్‌ మీద జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనని ప్రశ్నించేందుకు న్యాయస్థానం రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కనుక ఈ రోజు ఉదయం పోలీసులు ఆయనని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

బిఆర్ఎస్ నేతలు కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు ఆయన అరెస్టుని ఖండిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చాలా విమర్శలు చేశారు. కానీ హైకోర్టు బెయిల్ నిరాకరించడమే కాకుండా రెండు రోజుల పోలీస్ కస్టడీకి కూడా అనుమతించడం బిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోవడం కష్టమే అని చెప్పాలి. 

లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌ రెడ్డి మాత్రమే కాదు కేటీఆర్‌ ప్రమేయం కూడా ఉందని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కనుక ఆ కేసులో కేటీఆర్‌ని కూడా అరెస్ట్ చేస్తారని మీడియాలో వార్తలు రాగా వాటిపై కేటీఆర్‌తో సహా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు కూడా. 

ఒకవేళ పోలీసుల విచారణలో పట్నం నరేందర్‌ రెడ్డి తాను కేటీఆర్‌ ఆదేశంతోనే లగచర్ల దాడులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ ని ప్రోత్సహించానని చెపితే, కేటీఆర్‌తో పాటు బిఆర్ఎస్ పార్టీ కూడా చాలా పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. మరి కస్టడీలో ఉన్న పట్నం నరేందర్‌ రెడ్డి పోలీసులకు ఏం చెపుతున్నారో ఏమో?