హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ మూడు రైల్వే స్టేషన్లు నిత్యం వచ్చిపోయే రైళ్ళతో, ప్రయాణికులతో చాలా రద్దీగా మారడంతో వాటిపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వేశాఖ చర్లపల్లి వద్ద రూ.428 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ అద్బుతమైన రైల్వే స్టేషన్ నిర్మించింది. త్వరలోనే దాని ప్రారంభోత్సవం జరుగబోతోందంటూ కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేస్తూ రైల్వే స్టేషన్ ఫోటోలు, వివరాలు ప్రజలతో పంచుకున్నారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ ఫోటోలను చూస్తే అదేదో అంతర్జాతీయ విమానాశ్రయం అనిపిస్తుంది. అంత అద్భుతంగా, సకల సౌకర్యాలతో నిర్మించారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మొత్తం 10 రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి 25 జతల రైళ్ళు రాకపోకలు సాగించవచ్చు. రైల్వే స్టేషన్‌లో మొత్తం 9 సువిశాలమైన ప్లాట్ ఫారంలు ఉన్నాయి. స్టేషన్లో 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. నగరంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ నడుస్తున్న ఎంఎంటిఎస్ రైళ్ళ ద్వారా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు సులువుగా చేరుకోవచ్చు.
ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ శంకుస్థాపనకు రాబోతున్నారు. కనుక బహుశః అదే రోజున చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది.