తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ళలో ఈరోజు ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఉంటున్న నివాసంతో పాటు హిమాయత్ సాగర్‌లోని ఫామ్‌హౌస్, ఆయన కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్ళలో సాయంత్రం 6 గంటలకు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. సింగపూర్ నుంచి కస్టమ్స్ ఫీజు చెల్లించకుండా ఆలోకం నవీన్ కుమార్ అనే మద్యవర్తి ద్వారా ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ.100 కోట్లు విలువైన ఖరీదైన వాచీలు, ఇతర వస్తువులు పొంగులేటి కుమారుడు హర్ష రెడ్డి రప్పించిన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు హర్షరెడ్డికి నోటీస్ కూడా ఇచ్చారు.
వందకోట్లు విలువైన వస్తువులను పన్నులు చెల్లించకుండా విదేశాల నుంచి తెప్పించుకోవడం మనీలాండరింగ్ నేరం కింద పరిగణింపబడుతుంది. కనుక ఆ కేసు గురించి ఈడీ అధికారులు పొంగులేటితో సహా వారి బంధువుల ఇళ్ళలో కూడా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈడీ అధికారులు అధికారికంగా సోదాలకు సంబందించి వివరాలు ఇంకా తెలియజేయవలసి ఉంది.