జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదముద్ర!

పదేళ్ళ క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని చెపుతూనే ఉన్నారు. ఆ ప్రతిపాదనకు నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు.

మాజీ రాష్ట్రపతిః రాంనాధ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలపై విస్తృతంగా అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందజేశారు. దానిలో రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అంశాలతో పాటు పలు అంశాలని పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యమే అని కేంద్ర ప్రభుత్వం భావించినందునే నేడు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన్నట్లు భావించవచ్చు. 

జమిలి ఎన్నికలంటే లోక్‌సభ, దేశంలో అన్ని శాసనసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం కనుక కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాల గడువు ముగియక ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. అలాగే వివిద సంవత్సరాలు, నెలల్లో జరుగాల్సిన ఎన్నికలన్నిటినీ మార్చి ఒకే సమయంలో నిర్వహించాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2028 డిసెంబర్‌లో, లోక్‌సభ ఎన్నికలు 2029 ఏప్రిల్‌-మే నెలల్లో జరుగాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలలో ఇలాగే ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో కలిపి ఒకేసారి నిర్వహించాలనుకుంటే చాలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఏవిదంగా సాధ్యపడుతుందని రాంనాధ్ కోవింద్ చెప్పారో నివేదిక బయట పెడితేగానీ తెలీదు.