సిఎం రేవంత్‌ రెడ్డికి పవన్‌ కళ్యాణ్‌ మద్దతు

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్‌ నేతల అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తుండటంతో ప్రతిపక్షాలు కూడా వేలెత్తి చూపలేకపోతున్నాయి. ఇటీవల నాగబాబు సిఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయాన్ని సమర్ధించగా, ఇప్పుడు ఆయన సోదరుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌‌ కూడా మద్దతు తెలిపారు. 

విజయవాడ వరదల నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడ కూడా నాడీ పరీవాహక ప్రాంతాలను కబ్జాలు చేసి అనేకమంది ఇళ్ళు కట్టుకున్నారు. వాటి వలననే బుడమేరు పొంగి నగరాన్ని ముంచేసింది. దశాబ్ధాలుగా హైదరాబాద్‌లో కూడా చెరువులు, నాలాలు కబ్జా చేసి ఇళ్ళు నిర్మించుకోవడం వలననే వర్షం పడితే హైదరాబాద్‌లో వరద నీరు వచ్చేస్తోంది. కనుక ఆక్రమణల తొలగింపుకి తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేయడాన్ని నేను సమర్ధిస్తున్నాను. హైడ్రా పనిపూర్తి చేయగలిగితే హైదరాబాద్‌ నగరంలో భవిష్యత్‌లో వరదలు ఉండవు,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.