మహబూబాబాద్ జిల్లాలో 9 ఏళ్ళ బాలుడు ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లాలో హర్షవర్ధన్ అనే 9 ఏళ్ళ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు! గంగారం మండలంలోని చింతగూడెంకు చెందిన కాంతరావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఉంటూ (4వ తరగతి) చదువుకుంటున్నాడు. 

వేసవి సెలవులు ముగిసి మళ్ళీ హాస్టల్‌కు వెళ్ళే సమయం దగ్గర పడుతుండటంతో కాంతారావు కుమారుడికి జుట్టు కటింగ్ చేయించాలని సెలూన్‌కి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఓ సినిమా హీరో ఫోటో చూసి దానిలో ఉన్నట్లు జుట్టు కత్తిరించమని కోరాడు. కానీ కాంతారావు అందుకు ఒప్పుకోకుండా జుట్టు బాగా తగ్గించి కత్తిరింపజేశాడు. అందుకు తండ్రిపై అలిగిన హర్షవర్ధన్ ఇంటికి చేరుకున్న తర్వాత పురుగుల మందు తాగేశాడు. 

అది గమనించి తల్లితండ్రులు వెంటనే కుమారుడిని సమీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. కానీ వైద్యుల సూచన మేరకు కొడుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళారు.

కానీ అప్పటికే హర్షవర్ధన్ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తల్లితండ్రులు చేతులు పట్టుకొని విలవిలలాడుతూ చనిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు తమ చేతులలోనే చనిపోవడంతో ఆ తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.