కన్యాకుమారిలో మోడీ ధ్యానం... ఇన్ని సందేహాలా?

ప్రధాని నరేంద్రమోడీ గురువారం తమిళనాడులోని కన్యాకుమారి చేరుకొని అక్కడ సముద్రంలో గల స్వామి వివేకానంద స్మారక మందిరంలో సాయంత్రం 6.45 గంటల నుంచి ధ్యానం చేస్తున్నారు. ఆయన 45 గంటలపాటు ఎవరితో మాట్లాడకుండా, కేవలం కొబ్బరి నీళ్ళు, ద్రాక్ష రసం మాత్రమే త్రాగుతూ ధ్యానం చేస్తున్నారు. 

ఈ వార్త దేశంలోని అన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్‌లో ప్రముఖంగా వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ ధ్యానం చేస్తుండగా తీసిన ఫోటోలు, వీడియోలు కూడా వచ్చాయి. 

ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. అది ఆయన వ్యక్తిగత విషయం. ఎవరూ వేలెత్తి చూపడానికి లేదు. కానీ ఆయన ధ్యానం పేరుతో స్వీయ ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్‌, ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 

ఆయన ధ్యానం చేస్తుండగా చుట్టూ కెమెరాలు అమర్చి వాటితో ఫోటోలు, వీడియోలు తీసి మీడియాకు ఎవరు ఎందుకు విడుదల చేస్తున్నారు? ఆ వీడియోలకు సౌండ్ ఎఫెక్టులు ఎవరు ఎందుకు జోడిస్తున్నారు? ఇవన్నీ ప్రచారం కోసమే కదా?లేకుంటే వాటి అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 

మోడీని వ్యతిరేకించేవారు కూడా ఆయన ధ్యానం పేరుతో డ్రామా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు. ఆయన ధ్యానం చేయడం కంటే దానిని హైలైట్ చేసుకుంటున్నారని ఆక్షేపిస్తున్నారు.

అదేదో... ఢిల్లీలోని తన నివాసంలోనే చేసుకోవచ్చు కదా? ధ్యానం కోసం ప్రత్యేక విమానం... ఆయన కోసం భద్రతా సిబ్బంది... ఈ ఫోటోలు.... ఈ వీడియోలు హంగామా దేనికి? ఆ ఖర్చులన్నీ మేమే భరించాలి కదా? అంటూ మరికొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

కానీ ఎవరేమనుకున్నా ప్రధాని నరేంద్రమోడీ ధ్యానానికి అవేమీ భంగం కలిగించవు. కనుక చేసుకుపోతూనే ఉన్నారు.