సికింద్రాబాద్-విశాఖనగరాల మద్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించిన తర్వాత రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సికింద్రాబాద్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో బెర్తు సౌకర్యం లేకపోవడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకి జవాబు చెపుతూ, “బెర్తులు కలిగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు డిజైన్ కూడా సిద్దమైంది. అలాగే వందే భారత్ మెట్రో రైళ్ళ డిజైనింగ్ పని కూడా జరుగుతోంది. 2024లోగా వీటి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. వందే భారత్ మెట్రో రైళ్ళు అందుబాటులోకి వస్తే ప్రతీ రాష్ట్రంలో 200-250 కిమీ పరిధిలో పెద్ద పట్టణాలని కలుపుతూ ఇవి తిరుగుతాయి. ఇప్పుడు నడుస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ స్థానంలో ఈ వందే భారత్ మెట్రో రైళ్ళు తిరుగుతాయి.
“వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నందున సామాన్య ప్రజలు వీటిలో ప్రయాణించలేరు కదా?” అనే విలేఖరుల ప్రశ్నకి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ, “ఇప్పుడు ప్రయాణికులు ఛార్జీల కంటే రైళ్ళలో మంచి సదుపాయాలకి, సౌకర్యవంతమైన ప్రయాణానికి, సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు కనుకనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకి ఇంత డిమాండ్ ఉంటోంది. సామాన్య ప్రజల కోసం మొత్తం జనరల్ బోగీలు మాత్రమే ఉండే కొన్ని రైళ్ళని ప్రవేశపెట్టాము. త్వరలో మరిన్ని ప్రవేశపెడతాము,” అని సమాధానం చెప్పారు.
“సీనియర్ సిటిజన్లకి రాయితీ మళ్ళీ ఎప్పటి నుంచి ఇస్తారు?” అనే ప్రశ్నకి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చారు. “ఇప్పటికే ప్రతీ ప్రయాణికుడికి 55 శాతం రాయితీ ఇస్తున్నాము. ఈ సబ్సీడీల కోసం రైల్వేశాఖ ఏటా 59,000 కోట్లు భరిస్తోంది. కనుక సీనియర్ సిటిజన్లకి రాయితీ ఇప్పట్లో లభించే అవకాశం లేదు,” అని చెప్పారు.