తెలంగాణ రైతాంగానికి ప్రత్యేకంగా డిస్కం ఏర్పాటు

తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంతకాలం రాష్ట్రంలో ఉన్న నార్త్, సౌత్ డిస్కంల ద్వారానే విద్యుత్ సరఫరా అవుతుండేది. కానీ ఇకపై వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్‌పీ డీసిఎల్) పేరుతో కొత్త డిస్కం ఏర్పాటయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు జీవో జారీ చేసింది.

నార్త్, సౌత్ డిస్కంల నుంచి వ్యవసాయ విద్యుత్ వేరు చేసి, ఈ కొత్త డిస్కంకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని వ్యవసాయ రంగానికి సరఫరా అవుతున్న విద్యుత్ అంతా దీని కిందకే వస్తుంది.

వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత్ అవసరం? ఎంత వినియోగం అవుతోంది? దానికి ఎంత ఖర్చవుతోంది? వంటి ఖచ్చితమైన లెక్కలు తీయడంతో పాటు, కొత్త కనెక్షన్స్, విద్యుత్ లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం,  లో లేదా హై వోల్టేజ్ సమస్యలు ఇంకా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఇక నుంచి ఈ కొత్త డిస్కం పరిష్కరిస్తుంది.