
సంచలనం సృష్టించిన తెలంగాణ ఎఫ్-1 రేసింగ్ కేసులో త్వరలో ఏసీబీ ఛార్జ్ షీట్ వేయబోతున్నట్లు సమాచారం. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కి నోటీస్ జారీ చేసి విచారణ జరిపేందుకు గత ఏడాదే గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు.
ఇదే కేసులో ఐఏఎస్ అధికారి, మాజీ హెచ్ఎండీఏ డైరెక్టర్ అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటి అనుమతి మంజూరు చేసింది. కనుక త్వరలో వారిరువురికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశం మేరకు హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా రూ. 54.88 కోట్లు బదిలీ చేసిందని ఆరోపిస్తూ ఏసీబీ 2024, డిసెంబర్ 19న వారిపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. విచారణలో భాగం లబ్ది పొందిన విదేశీ కంపెనీ ప్రతినిధులను కూడా ప్రశ్నించి వివరాలు రాబట్టారు. నిధులు బదిలీకి సంబంధించి డిజిటల్ సాక్ష్యాధారాలు కూడా సేకరించారు.
దీంతోబాటు బీఆర్ఎస్ పార్టీఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంపై కూడా విచారణ జరిపి ఎఫ్-1 రేసింగ్ కేసుతో బీఆర్ఎస్ పార్టీ లబ్ది పొందిందని ఛార్జ్ షీట్లో పేర్కొనబోతున్నట్లు సమాచారం. ఈ కేసు విచారణ ముగింపులో చివరిగా కేటీఆర్,అరవింద్ కుమార్ ఇద్దరినీ కూడా ప్రశ్నించి వారి వాంగ్మూలాలు రికార్డ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఒకవేళ ఈ కేసులో కేటీఆర్‌కి ఏసీబీ నోటీస్ జారీ చేసినట్లయితే, కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మళ్ళీ వేడెక్కుతుంది.