
హైదరాబాద్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.200 కోట్లు వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇదివరకే ఒకసారి అభ్యంతరం తెలిపిన గాంధీజీ మనుమడు తుషార్ గాంధీ, మళ్ళీ నేడు మరోమారు అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తీరుని ఆక్షేపించారు.
ఆయనేమన్నారంటే, “గాంధీజీ సిద్దాంతాలు పాటించనప్పుడు, ఎంత పెద్ద విగ్రహాలు పెట్టినా ఉపయోగం ఉండదు. నేను మొదటి నుంచి విగ్రహాల ఏర్పాటుని వ్యతిరేకిస్తూనే ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నాను. ప్రజాభిప్రాయాన్ని కాదని గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యమనిపించుకోదు.
నేను ఈ విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తూ నేను మళ్ళీ మాట్లాడుతున్నాను కనుక ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని నిలిపివేస్తుందని అనుకోవడం లేదు. ప్రస్తుతం పదవీ, అధికారం చేతిలో ఉన్నవారందరూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. దీనికి సమాధానం ప్రజల వద్దే ఉంది. అదే ఓటు హక్కు. అది మాత్రమే ప్రజలకు సాయపదగలదు. నేను కాదు,” అని అన్నారు.