
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిభ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజునాడు నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించబోతున్నట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకి తెలిపారు. రూ.617 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ కొత్త సచివాలయానికి డా. బీఆర్. అంబేడ్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ నూతన సచివాలయంలో ఆరు అంతస్తులలో మొదటి రెండు అంతస్తులలో సాధారణ పరిపాలన శాఖ, ఆర్ధిక శాఖల కార్యాలయాలు, మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. మిగిలిన నాలుగు అంతస్తులలో వివిద శాఖల కార్యాలయాలు ఉంటాయి. అక్కడే సచివాలయ ఉద్యోగులందరూ పనిచేస్తారు. వాటి కార్యదర్శులు, ఉన్నతాధికారులు, అధికారుల కార్యాలయాలు కూడా ఆయా అంతస్తులలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఆరో అంతస్తులోనే ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం, మీడియా సమావేశ మందిరం వగైరాలు ఉంటాయి.
కొత్త సచివాలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వాటిలో తూర్పున గల లుంబినీ పార్క్ వైపు ఏర్పాటు చేసిన ద్వారం నుంచి సిఎం కేసీఆర్, మంత్రులు లోనికి ప్రవేశిస్తారు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ ఎన్టీఆర్ గార్డెన్స్ వైపున్న ప్రవేశ ద్వారం గుండా రాకపోకలు సాగిస్తారు. బిర్లామందిర్ రోడ్డు వైపు గల పెట్రోల్ బంక్ తొలగించి అక్కడ మరో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంలో వివిద పనుల కోసం వచ్చే ప్రజలు, సందర్శకుల కొరకు దానిని కేటాయించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద జంక్షన్ నుంచి సచివాలయంలో ప్రవేశించేందుకు మరో ప్రవేశద్వారం ఏర్పాటుచేశారు. దీనిని అత్యవసర సమయాలలో మాత్రమే వినియోగిస్తారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు సిఎం కేసీఆర్ సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచే పాలనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సిఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ వాస్తు ప్రకారం ఈ కొత్త సచివాలయం నిర్మించుకొన్నారు కనుక ఫిభ్రవరి 17 నుంచి సచివాలయానికి వస్తారని భావించవచ్చు.