ఒడిశా బిఆర్ఎస్‌ అధ్యక్షుడిగా గిరిధర్ గొమాంగ్?

సిఎం కేసీఆర్‌ సంక్రాంతి పండుగ తర్వాత ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో బిఆర్ఎస్‌ పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీకి తోట చంద్రశేఖర్‌ని అధ్యక్షుడిగా నియమించారు. తర్వాత ఒడిశా బిఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌ని నియమించబోతున్నారు. 

శుక్రవారం ఆయన తన కుమారుడు శిశిర్ గమాంగ్‌తో కలిసి హైదరాబాద్‌ వచ్చి ప్రగతి భవన్‌ సిఎం కేసీఆర్‌తో సుదీర్గంగా భేటీ అయ్యారు. 79 ఏళ్ళు వయసున్న గిరిధర్ గమాంగ్‌ వరుసగా 8సార్లు ఎంపీగా గెలిచారు. 1999లో సుమారు ఏడాది పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకి ఇంత సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, గత 15 ఏళ్ళుగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ (బీజేడీ) అధికారంలో కొనసాగుతుండటంతో రాజకీయ ఉపాధి కోసం ఎదురుచూడవలసి వస్తోంది. కనుక కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తుండటం గిరిధర్ గమాంగ్‌కి కలిసివచ్చింది. 

కేసీఆర్‌ నుంచి ఆహ్వానం రావడంతో ఆయన వెంటనే హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యి ఒడిశాలో బిఆర్ఎస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. గమాంగ్ మొదట కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి తర్వాత బిజెపిలో చేరి దానిలో ఇమడలేక బయటకి వచ్చేసి రాజకీయ ఉపాధి కోసం ఎదురుచూస్తుండగా, ఊహించనివిదంగా ఈ  లాటరీ తగిలింది. ఇప్పుడు ఆయన కొడుకుకి కూడా రాజకీయాలలో స్థిరపడే అవకాశం బిఆర్ఎస్‌ ద్వారా లభిస్తోంది.