మోడీ గురించి తెలంగాణ కాంగ్రెస్‌కి ఓ ధర్మసందేహం!

తెలంగాణ కాంగ్రెస్‌ కుమ్ములాటలతో ఎంత బిజీగా ఉన్నా దాని సోషల్ మీడియా టీమ్‌ మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలే కనుక వారికి సంబందించిన ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వాటిపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటుంది. అటువంటిదే ఇది కూడా. 

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరబెన్ మోడీ డిసెంబర్‌ 30వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆమె పాడిమోసి చాలా నిరాడంబరంగా అంత్యక్రియలు పూర్తిచేశారు. దీనిని ఎవరూ తప్పుపట్టలేదు కానీ సాధారణంగా హిందువులు తల్లితండ్రులు చనిపోయినప్పుడు గుండుకొట్టించుకొని పిలక పెట్టుకొంటారు కదా కానీ హిందూ మతాన్ని ఉద్దరిస్తున్నానని చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోడీ తల్లి చనిపోతే ఎందుకు గుండు కొట్టించుకోలేదు?ఇప్పుడు చెప్పండి హిందూ మతాన్ని నాశనం చేసేది ఎవరు?” అంటూ కాంగ్రెస్‌ ఫర్ తెలంగాణ ట్వీట్ చేసింది. 

గతంలో తాను బస్టాండులో ఛాయ్ అమ్ముకొంటూ జీవించేవాడినని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొంటారు కనుక మరో ట్వీట్‌లో భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ఓ హోటల్‌లో టిఫిన్ చేసి టీ తాగుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోని కొద్దిగా మార్చి ఆయన వెనుక ప్రధాని నరేంద్రమోడీ ఛాయ్ కెటిల్ పట్టుకొని గ్లాసులో టీ పోస్తున్నట్లు ఫోటో జోడించింది.