మహబూబాబాద్ జిల్లాపై కేసీఆర్‌ వరాల జల్లు

పది జిల్లాలుగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన తర్వాత కొత్త జిల్లాలకి కలెక్టర్ కార్యాలయాలు నిర్మించాల్సి వచ్చింది. అయితే ఎలాగూ కొత్తవి నిర్మిస్తున్నప్పుడు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,581.62 కోట్లు వ్యయంతో 29 సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మిస్తోంది. వాటిలో ఇప్పటికే 14 కలెక్టరేట్లు ప్రారంభం కాగా సిఎం కేసీఆర్‌ ఈరోజు ముందుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శాంతి కుమారి కూడా పాల్గొన్నారు. ఆమె తన ప్రసంగంలో కేసీఆర్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ మహబూబాబాద్ జిల్లా గురించి ప్రసంగిస్తూ, “ఒకప్పుడు తెలంగాణలో మహబూబాద్ అన్నిటికంటే వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 8 ఏళ్లలో మహబూబాద్ ఎంతగానో అభివృద్ధి చేసుకొన్నాము. ఒకప్పుడు జిల్లాలో283 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని 461 చేసుకొన్నాము. మహబూబాద్ జిల్లాని ఏర్పాటుచేద్దామన్నప్పుడు కొందరు అవసరం లేదని చెప్పారు. కానీ ఈ మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా జిల్లాగా మార్చి స్థానికంగా పరిపాలన సాగాలని భావించి జిల్లా ఏర్పాటు చేశాను. ఇప్పుడు జిల్లాలో అద్భుతమైన సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మించుకొన్నాము. వైద్య కళాశాల నిర్మించుకొన్నాము. ఇంకా జిల్లాలో చాలా అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. కనుక మహబూబాబాద్ పట్టణం అభివృద్ధికి 50 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నాను. వచ్చే ఏడాదిలోగా ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తాము. జిల్లాలో ప్రతీ గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాను. వీటితో మీ పంచాయతీలలో ఏం అభివృద్ధి పనులు చేసుకొంటారో మీ ఇష్టం. ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తాం,” అంటూ అనేక వరాలు కురిపించారు.

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుతూ, “మనకి పక్కనే నదులున్నాయి. వాటిలో నీళ్ళున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్టమైన వ్యవస్థలు, అలసత్వం కారణంగా దశాబ్ధాలుగా ఆ నీళ్ళు మన రైతులకు చేరలేదు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే మొండిగా ముందుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని రైతులకు నీళ్ళు అందించాము. ఒకప్పుడు నీళ్ళ కోసం 600-700 అడుగులు బోర్లు వేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు మోటర్లు ఆన్‌ చేయకుండానే బోర్లలో నుంచి పాతాళగంగ పొంగిపొర్లుతోంది. ఇదేవిదంగా దేశంలో అనేక నదులున్నాయి. కావలసినంత విద్యుత్‌ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అసమర్దత, అలసత్వం కారణంగా అవి ప్రజలకు చేరడం లేదు. కనుక మన తెలంగాణ రాష్ట్రంలోలాగే కేంద్రంలో కూడా ఓ మంచి ప్రభుత్వం ఏర్పడితే తప్ప దేశం బాగుపడదు. ప్రజల కష్టాలు తీరవు,” అని కేసీఆర్‌ అన్నారు.