ఏపీకి సోమేష్... మరి తెలంగాణకి ఎవరు?

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని తక్షణం ఏపీ ప్రభుత్వంలో చేరాలని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఇంకా తెలియవలసి ఉంది. ఆయన హటాత్తుగా పదవి నుంచి తప్పుకోవలసిరావడంతో ఆ స్థానంలో సిఎం కేసీఆర్‌ ఎవరిని నియమిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

హైకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత సోమేష్ కుమార్‌ ప్రగతి భవన్‌కి వెళ్ళి సిఎం కేసీఆర్‌తో సుమారు గంటసేపు చర్చించారు. సోమేష్ కుమార్‌ ఏపీకి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు. అలాగే సిఎం కేసీఆర్‌ కూడా ఆయనని వదులుకొనేందుకు ఇష్టపడటం లేదు. కనుక చివరి ప్రయత్నంగా ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు లేదా ఒకవేళ సిఎం కేసీఆర్‌ ఆయనని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. 

ఆయన స్థానంలో తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణ రావుని లేదా మున్సిపల్ మరియు అర్బన్‌ డెవలప్‌మెంట్ శాఖకి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బిహార్‌కి చెందిన అరవింద్ కుమార్‌లలో ఎవరో ఒకరిని నియమించవచ్చని సమాచారం. అయితే ఇప్పటికే రాష్ట్రంలో అన్ని కీలక పదవులలో బీహార్ క్యాడర్ అధికారులతో కేసీఆర్‌ నింపేశారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తునందున ఏపీకి చెందిన 1990 ఐఏఎస్ బ్యాచ్ అధికారి రామకృష్ణారావుని నియమించే అవకాశం కనిపిస్తోంది.   

హైకోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో సోమేష్ కుమార్‌ని తక్షణం విధుల నుంచి విముక్తి కల్పించాల్సి ఉంటుంది కనుక తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆయన స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.