ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఖమ్మంలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించేశారు. వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత నాలుగేళ్ళుగా సిఎం కేసీఆర్‌ని ఓ తండ్రిగా భావిస్తూ ఎంతో గొరవిస్తున్నాను. మా ఇద్దరిదీ తండ్రీకొడుకుల బందం అని నమ్మేవాడిని. కానీ అయన నా పట్ల అటువంటి, ప్రేమ, గౌరవం ఇవ్వలేదు. ప్రేమ, గౌరవం రెండు పక్కలా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. గౌరవించడం అంటే ఇద్దరు గన్‌మెన్‌లను ఇవ్వడం కాదు. నాకు ఎన్నివేల కోట్ల కాంట్రాక్టర్ ఇచ్చామని అనుకొంటున్నారేమో? కానీ నేను రాజకీయాలలోకి, పార్టీలోకి రాక ముందు నుంచే కాంట్రాక్టరుగా ఉన్నాడు.
నేను పార్టీని ఎదురిస్తున్నాను కనుక నా బిల్లులు నిలిచిపోతాయని నాకు తెలుసు. కానీ అటువంటివాటికి నేను భయపడబోను. నేను ఉమ్మడి జిల్లాలో నా ప్రజలు, అభిమానుల వద్దకి వెళ్ళి జోలి పట్టుకొని బిచ్చమెత్తి రాజకీయాలు చేస్తాను తప్ప మీకు భయపడేది లేదు. మీరు ఇబ్బందులు పెడుతూ నా సహనానికి పరీక్షిస్తుంటే ఎల్లకాలం నేను మౌనంగా భరిస్తూ ఉండిపోతానని అనుకోవద్దు.
కేసీఆర్ చేతిలో అధికారం ఉంది కదాని అసెంబ్లీని ఓ సామ్రాజ్యంగా చేసుకొని ప్రజలని ఇబ్బంది పెడుతూ రాష్ట్రాన్ని దోచుకొంటున్నారు. కానీ ప్రజలకీ సమయం వస్తుంది. అప్పుడు ఆయనకి తప్పకుండా తగినవిదంగా బుద్ధి చెపుతారు. నేను పార్టీ మారదలిస్తే ఢిల్లీకో గల్లీకో పోయి రహస్యంగా పార్టీ కండువా కప్పుకోను. ఈ ఖమ్మం గడ్డ మీదే నా రెండున్నర లక్షల అభిమానుల మద్య ధైర్యంగా పార్టీ మారుతాను,” అని అన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలని బట్టి ఆయనకి పార్టీలో సముచిత గౌరవం, కాంట్రాక్టులో చేసినా వాటి బిల్లులు చెల్లింపులు చేయకపోవడం, వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వకపోవడం వలననే ఆయన తిరుగుబాటుచేస్తున్నట్లు అర్దమవుతోంది. కేసీఆర్‌ని పేరు పెట్టి బహిరంగంగా విమర్శించారు కనుక బిఆర్ఎస్ పార్టీలో వేటు వేయించుకొని బిజెపిలో చేరేందుకు సిద్దమవుతున్నట్లే భావించవచ్చు. జనవరి 18న ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలవబోతున్నట్లు సమాచారం. అక్కడ కండువా వేయించుకొని జనవరి 19న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి సభలో పాల్గొనే అవకాశం ఉంది.