తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి, ఆయన కోసం పట్టుబడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన్నట్లుగా ఆయన తప్పనిసరిగా ఆంధ్రాకి వెళ్ళవలసిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు మూడు వారాలు ఈ ఉత్తర్వులను నిలిపి ఉంచాలని ఆయన తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధనని కూడా హైకోర్టు తిరస్కరించింది.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం సోమేష్ కుమార్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆ ఉత్తర్వులని నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేందుకు అనుమటించింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయనని ఏపీకి బదిలీ చేసేందుకు న్యాయపోరాటం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సోమేష్ కుమార్ తక్షణం ఏపీకి వెళ్ళాల్సిందే అని తీర్పు చెపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తెలంగాణలో కొనసాగేందుకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
మంచి సమర్దుడు, వివాదరహితుడుగా పేరొందిన సోమేష్ కుమార్ పట్ల తెలంగాణ సిఎం కేసీఆర్‌కి చాలా గౌరవం ఉంది. అందుకే ఏరికోరి ఆయనని సిఎస్‌గా నియమించుకొన్నారు. సోమేష్ కుమార్ కూడా సిఎం కేసీఆర్ అంచనాలకు మించి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అటువంటి మంచి అధికారి ఇప్పుడు ఏపీకి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో రాజకీయాలతో పాటు వ్యవస్థలన్నీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయి ఉన్నాయి. కనుక ఏపీకి వెళ్ళాలని ఏ ఉన్నతాధికారి కోరుకోరు. ఒకవేళ వెళ్ళాల్సివస్తే ఆ బురద అంటించుకోకతప్పదు. కనుక సోమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.