సంగారెడ్డి గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామ సర్పంచ్ మాకం తిరుమల వాసు తన ప్రాణాలు కాపాడాలంటూ ట్విట్టర్లో పెట్టిన ఓ సందేశంపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్, అధికారులని పరుగులు పెట్టించారు. ఇంతకీ వాసు ఏదో తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరలేదు. తన గ్రామంలోని సర్వే నంబర్ 261లో సుమారు రూ.1,000 కోట్లు చేసే 588 ఎకరాల భూమి కబ్జా అవుతుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతనిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అదేవిషయం తెలియజేస్తూ సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకి ట్విట్టర్లో సందేశాలు పెట్టి ప్రభుత్వ భూమిని, నిరుపేద రైతులు, రిటైర్డ్ మిలటరీ ఉద్యోగులకి కేటాయించిన ఆ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దానిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి జిల్లా అధికారులను పరుగులు పెట్టించారు.
అన్నారం గ్రామ రైతులతో జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, డీఎల్పీవో సతీష్ రెడ్డి, తహశీల్దార్ సుజాత సమావేశమయ్యి ఈ భూఆక్రమణ గురించి చర్చించారు. వెంటనే సర్వే చేయించి రైతులందరికీ పట్టాలు అందజేయాలని, ఆ సర్వే నివేదికని ఆన్లైన్లో పెట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అలాగే అన్నారం గ్రామ సర్పంచ్ తిరుమల వాసుని బెదిరిస్తున్నవారెవరో తెలుసుకొని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా సకాలంలో తెలియజేసి కాపాడినందుకు తిరుమల వాసుని మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఓ గ్రామంలో ఇంత విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతుంటే జిల్లా యంత్రాంగానికి తెలియకుండా ఉండదు. కానీ ఒత్తిళ్ళకి, ప్రలోభాలకి లొంగి చూసిచూడన్నట్లు ఊరుకోవడం వలననే ప్రభుత్వ భూమిని కబ్జా చేయగలగుతున్నారు. కనుక ముందుగా వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా అవసరం.