మాకు ఈ మాస్టర్ ప్లాన్ వద్దు: కామారెడ్డి రైతులు

కామారెడ్డి పట్టణం మాస్టర్ ప్లాన్‌లో చుట్టుపక్కల 8 గ్రామాలలోని 2,170 ఎకరాలను పారిశ్రామిక జోన్‌లో చేర్చడంపై పట్టణంలో రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కామారెడ్డి పురపాలక సంఘం ప్రతిపాదిస్తున్న మాస్టర్ ప్లాన్‌ని వ్యతిరేకిస్తూ జిల్లాకి చెందిన కొందరు రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అలాగే కొందరు రైతులు మున్సిపాల్ కమీషనర్‌కి లాయర్ నోటీసులు పంపించారు. ఈ ప్రతిపాదనకి నిరసన తెలుపుతూ రైతులు మొన్న కలెక్టర్‌ కార్యాలయానికి వస్తే పోలీసులు వారిని అడ్డుకొన్నారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ కూడా చేయడంతో రైతులు పిలుపు మేరకు నిన్న కామారెడ్డి పట్టణంలో బంద్‌ నిర్వహించారు. 

రైతులకు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతుండటంతో సున్నితమైన ఈ సమస్యపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. రైతులకి మద్దతు తెలిపేందుకు కామారెడ్డికి వస్తున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ నేతలు వెంకటరమణా రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.