మన తెలుగువాడు, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ళ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రధాని నరేంద్రమోడీని కలిసిన ఆయన ఇవాళ్ళ తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలుసుకొన్నారు. ఈ సందర్భంగా తామిరువురం తెలంగాణలో పెట్టుబడులు, టీ-హబ్ విస్తరణ, ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడుకొన్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే కాసేపు సరదాగా హైదరాబాద్ బిర్యానీ గురించి కూడా మాట్లాడుకొన్నామని తెలిపారు.
సత్య నాదెళ్ళ నిన్న బెంగళూరులో ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో పాల్గొన్నప్పుడు అక్కడ కృత్రిమ మేదస్సు ఆధారంగా పనిచేసే చాట్ రోబో ‘చాట్ జీపీటీ’ని పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏమిటని ప్రశ్నించగా అది ‘ఇడ్లీ, వడ, దోశ, బిర్యానీ’ అని సమాధానం చెప్పింది. అప్పుడు సత్య నాదెళ్ళ స్పందిస్తూ, “బిర్యానీ గురించి నాకు బాగా తెలుసు. అది టిఫిన్ కాదు,” అని చెప్పడంతో ఆ రోబో ఆయనకి ‘సారీ’ చెప్పింది. ఇదే విషయం నేడు సత్య నాదెళ్ళతో భేటీ అయినప్పుడు తాము సరదాగా మాట్లాడుకొన్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ 8 సంవత్సరాలలో ఐటి, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధి చెందాయి. దాని వెనుక మంత్రి కేటీఆర్ కృషి చాలా ఉందని సత్య నాదెళ్ళకి తెలుసు. వాటితో పాటు నగరంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మించడంతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. బహుశః ఈ మార్పులన్నిటినీ సత్య నాదెళ్ళ గమనించే ఉంటారు. కనుక మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలంగాణలో మరో భారీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని భావించవచ్చు.