కామారెడ్డి పట్టణంలో చిచ్చు రాజేసిన మాస్టర్ ప్లాన్

కామారెడ్డి పట్టణంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పురపాలక సంఘం రూపొందించి కొత్త మాస్టర్ ప్లాన్ ఈ చిచ్చుకి కారణం. కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాలలో 8 గ్రామాలలోని 2,170 ఎకరాలను పారిశ్రామిక జోన్‌లో చేర్చడంతో ఆయా గ్రామాల రైతులు ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు తెలిపారు. వారిలో కొంతమంది న్యాయపోరాటం కూడా ప్రారంభించారు. 

రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో నిన్న వేలాదిమంది రైతులు తమ కుటుంబాలతో కలిసి కలెక్టర్ జితేష్ పటేల్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు తరలివచ్చారు. కానీ దారిలో బ్యారికేడ్లు పెట్టి పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యారికేడ్లను దాటుకొని కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. తక్షణం కలెక్టర్ బయటకి వచ్చి తమ సమస్యపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్‌పై చేశారు. 

కానీ రైతులలో పదిమందిలోనికి వెళ్ళి కలెక్టర్‌తో మాట్లాడాలని పోలీసులు సూచించడంతో వారు అందుకు నిరాకరించి కలెక్టర్‌ కార్యాలయం ఎదుటే రాత్రి వరకు బైటాయించి నిరసనలు తెలిపారు. తమ సమస్యల గురించి తమతో మాట్లాడేందుకు బయటకి రావడానికి ఇష్టపడని కలెక్టర్‌ జితేష్ పటేల్‌ డౌన్‌ డౌన్‌... అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం వరకు గేటు ముందు ధర్నా చేసినా కలెక్టర్‌ బయటకి రాకపోవడంతో కొందరు రైతులు గేట్లు దూకి లోనికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకొనే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో కొందరు గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు గేటు ముందే ధర్నా చేస్తున్నా కలెక్టర్‌ జితేష్ పటేల్‌ మాత్రం బయటకి రాలేదు. అసలే చలి విపరీతంగా ఉండటం, చీకటి పడుతుండటంతో రైతులు కలెక్టర్‌ దిష్టిబొమ్మకి వినతిపత్రం సమర్పించి ఆందోళన విరమించారు. కలెక్టర్‌ తీరుని, మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనని నిరసిస్తూ రైతులు ఈరోజు కామారెడ్డి పట్టణంలో బంద్‌కి పిలుపిచ్చారు. 

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుభాష్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జడ్పీ మాజీ ఛైర్మన్ వెంకటరమణా రెడ్డి తదితరులు రైతుల ఆందోళనకి సంఘీభావం ప్రకటించారు. 

కామారెడ్డి పురపాలక సంఘంలో కొందరు అధికారులు బిఆర్ఎస్‌ నేతలతో కుమ్మక్కై తమ పంట భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్పించారని రైతులు వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో తమ భూములను పారిశ్రామికవాడ కోసం ఇవ్వబోమని రైతులు చెపుతున్నారు. 

కామారెడ్డి పట్టణంలో రైతుల ఆందోళనపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “ఈ మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా కాపీ మాత్రమే. దీనిపై అందరి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకొన్న తర్వాతే తదనుగుణంగా ఫైనల్ ప్లాన్ ఖరారు చేస్తాము. మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగానే పనిచేస్తుంది తప్ప వారికి నష్టం కలిగించదు. దీనిపై ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడం మానుకోవాలి,” అని అన్నారు.