అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న రామ మందిరం నిర్మాణపనులన్నీ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి ప్రారంభోత్సవానికి సిద్దమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. త్రిపుర శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో జరుగనున్నాయి.
కనుక ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు జరిగిన ఓ బహిరంగసభలో ప్రసంగిస్తూ, “రాహుల్ బాబా (రాహుల్ గాంధీ) రామాలయం గురించి అపహస్యంగా మాట్లాడుతుంటారు. మేము రామాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకొంటూ ఆ పేరుతో రాజకీయాలు చేస్తుంటామే తప్ప అయోధ్యలో రామాలయం ఎప్పడూ పూర్తవుతుందో చెప్పమని మమ్మల్ని ఆక్షేపిస్తుంటారు. కనుక ఇప్పుడు ఈ సభావేదిక మీద నుంచి చెపుతున్నాను. రాహుల్ బాబా... చెవులు రిక్కించి శ్రద్దగా వినండి. 2024, జనవరి 1వ తేదీన రామాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. వీలైతే మీరు కూడా తప్పకవచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనండి. దశాబ్ధాలుగా మీరు నానబెట్టిన సమస్యని మా ప్రభుత్వం పరిష్కరించడమే కాకుండా అయోధ్యలో రామాలయం నిర్మాణం కూడా పూర్తి చేస్తోంది,” అని అన్నారు.