టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే చిన్నయ్య దాడి

బెల్లంపల్లి బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఆయన వాహనం అక్కడకి చేరుకొన్నప్పుడు టోల్‌ప్లాజా సిబ్బంది వెంటనే తన వాహనాన్ని పంపలేదనే కోపంతో ఎమ్మెల్యే చిన్నయ్య సిబ్బందిలో ఒకరి చెంప చెళ్లుమానిపించారు. తర్వాత టోల్‌ప్లాజాలో కాసేపు అందరిపై చిందులు వేసి వెళ్ళిపోయారు. 

మందమర్రి టోల్‌ప్లాజా గత నేనలోనే ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి దాని నిర్వాహకులు వాహనదారుల నుంచి ఫీజ్ వసూలు చేస్తున్నారు. అయితే టోల్‌ప్లాజాకి ముందు రోడ్డు పనులు పూర్తికాకుండా ఫీజ్ వసూలు చేస్తున్నారంటూ పిర్యాదులు వస్తున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిన్న ఇదే వంకతో వారిపై దాడి చేశారు. అక్కడ సిసి కెమెరాలలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రజా ప్రతినిధులు టోల్‌ప్లాజాలకి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వారి వాహనాలను ముందుగా బయటకి పంపించవలసి ఉంటుంది. కానీ ఒక్కోసారి వారి ముందున్న వాహనదారులు ఫీజు చెల్లిస్తున్నప్పుడు ఆలస్యంకావచ్చు. కనుక అటువంటప్పుడు ఖాళీగా ఉన్న లైన్‌లో నుంచి ప్రజాప్రతినిధులు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈవిదంగా టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేస్తుండటం దూరలవాటుగా మారింది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు అహంభావంతో వ్యవహరిస్తున్నా వారి అధినేత వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలననే వారు ఈవిదంగా వ్యవహరించగలుగుతున్నారని చెప్పవచ్చు.