అవును.. అయ్యప్పస్వామిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాను: బైరి నరేష్‌

ఉస్మానియా విద్యార్ధి, నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్‌ తాను ఉద్దేశ్య పూర్వకంగానే అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన్నట్లు అంగీకరించాడు. వికారాబాద్ జిల్లా, కొడంగల్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయం పేర్కొన్నారు. బైరి నరేష్, డోలు హనుమంతు అనే ఇద్దరు నిందితులు తాము మత విద్వేషాలు రగిలించేందుకు సభ ఏర్పాటు చేసి ఉద్దేశ్యపూర్వకంగానే  అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన్నట్లు అంగీకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకుగాను వారిరువురిపై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు ఉన్నాయని, వాటిపై కూడా అన్ని కోణాలలో నుంచి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు జిల్లా కోర్టుకి తెలియజేశారు. 

డిసెంబర్‌ 19వ తేదీన జరిగిన ఈ ఘటనపై కొత్త ఉమాపతి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు డిసెంబర్‌ 30వ తేదీన ఎఫ్ఐఆర్‌ నంబర్: 185/2022గా నమోదైన ఈ కేసులో బైరి నరేష్, డోలు హనుమంతులు ఏ-1, ఏ-2 నేరస్తులుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల పేర్లను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ కేసులో బైరి నరేష్, డోలు హనుమంతు ఇరువురూ పోలీసుల విచారణలో నేరం అంగీకరించడం మంచిదే. అయితే వారిరువురూ బహుశః ఉడుకు రక్తం, దుందుదుడుకుతనంతోనే ఇటువంటి అనుచిత ప్రసంగాలు చేసి ఉండవచ్చు తప్ప మతవిద్వేషాలు రగిలించే ఉద్దేశ్యంతో ఆ సభ నిర్వహించి ఉండకపోవచ్చు. వారు ఏ కారణంతో సభ నిర్వహించినప్పటికీ కోట్లాదిమంది ఆరాదించే అయ్యప్పస్వామిని కించపరుస్తూ వారి మనసులు నొప్పించినందున శిక్ష తప్పదు. కానీ ఈ దుందుదుడుకుతనం వలన పోలీసుల రికార్డులకెక్కి చేజేతులా తమ భవిష్యత్‌కి తీరని నష్టం కలిగించుకొన్నట్లయింది.