హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం రేపే!

హైదరాబాద్‌లో నిత్యం ఉద్యోగాలకు, వ్యాపారాల కోసం తిరిగేవారికి నగరంలో బండి... అది ఏసీ కారైన ఎంత కష్టమో తెలుసు. రోజురోజుకీ వాహనాలు పెరిగిపోతుండటంతో రోడ్ల మీద ప్రయాణం నరకమే. అందుకే నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తూనే ఉంది. రేపు నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో కొత్తగూడ-గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించబోతున్నారు.

దీనిలో ఎస్ఎల్ఎన్ టెర్మినల్ నుంచి బొటానికల్ జంక్షన్ వరకు 5 లేన్లతో నిర్మించగా, అక్కడి నుంచి కొత్తగూడ జంక్షన్ వరకు 6 లేన్లతో నిర్మించారు. కొత్తగూడ నుంచి కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు వరకు 3లేన్లతో, మసీదు బండ నుంచి బొటానికల్ జంక్షన్ వరకు రెండు లేన్లతో  నిర్మించారు. 

కొత్తగూడ్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్ళేందుకు 383 మీటర్లు పొడువుతో 3లేన్లతో డౌన్‌ ర్యాంప్ నిర్మించారు. రూ. 263 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ పొడవు 2,216 మీటర్లు.  హఫీజ్ పేటకు వెళ్ళేందుకు దీని కింద 470 మీటర్ల పొడవుతో 3 లేన్లతో ఓ అండర్ పాస్ కూడా నిర్మించారు.

రేపటి నుంచే ఈ కొత్త ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తుంది కనుక బొటానికల్ గార్డెన్, కొత్తగూడా జంక్షన్, కొండాపూర్ జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాంతాలలో చాలా ఐ‌టి కంపెనీలు ఉన్నందున వాటిలో పనిచేసే ఉద్యోగులకు ఈ కొత్త ఫ్లైఓవర్‌తో చాలా ఉపశమనం లభిస్తుంది.