హస్తం పార్టీకి హ్యాండ్‌ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్‌

ఎన్నికల వ్యూహ నిపుణుడు, ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. గత నెలరోజులుగా ఆ పార్టీ అధిష్టానం, సీనియర్ నేతలతో వరుస సమావేశాలలో పాల్గొంటున్న ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున పనిచేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా బయట నుంచి కాంగ్రెస్‌ కోసం పనిచేయడం కంటే పార్టీలో చేరి పనిచేయాలనే అధిష్టానం ఆహ్వానానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 

అయితే హైదరాబాద్‌ వచ్చి సిఎం కేసీఆర్‌తో వరుసగా రెండు రోజులు భేటీ అయిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోనని ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో తెలియజేస్తూ, “కాంగ్రెస్‌ సాధికార కమిటీలో చేరి ఎన్నికల బాధ్యతలను స్వీకరించాలంటూ ఆ పార్టీ ఉదారంగా ఇచ్చిన ఆఫర్‌ను నేను తిరస్కరిస్తున్నాను. నేను వినయపూర్వకంగా ఆ పార్టీ అధిష్టానానికి తెలియజేసేదేమిటంటే, కాంగ్రెస్ పార్టీకి నా అవసరం కంటే దాని నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఆ పార్టీలో చాలా లోతుగా పేరుకుపోయున్న అనేక సమస్యలకు పార్టీ నాయకత్వ మార్పు, సంస్థాగత మార్పులే పరిష్కారమని నేను భావిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.