జూబ్లీహిల్స్‌: పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాలు రేపు (శుక్రవారం) వెలువడబోతున్నాయి. యూసఫ్‌ గూడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆనవాయితీ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు.

మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం 42 టేబిల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 186 మంది సిబ్బంది ఓట్లు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు. పడి రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్‌ఓ కర్ణన్ చెప్పారు.

ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ, ఈసీ అధికారిక వెబ్‌ సిరీస్‌లో కూడా అప్‌లోడ్‌ చేస్తుంటామని చెప్పారు. ఏజంట్లు, మీడియా ప్రతినిధుల కోసం బయట ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశామని కర్ణన్ చెప్పారు. 

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు స్టేడియం పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నగర జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ తఫ్సీర్ ఇక్బాల్ చెప్పారు. స్టేడియం వద్ద మొత్తం 250 మంది పోలీసులు, 15 ప్లాటూన్ల భద్రతా సిబ్బందిని మొహరిస్తున్నామని తెలిపారు. గుర్తింపు కార్డులు, అనుమతి కలిగిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కేవలం 48.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే రెండు లక్షల కంటే తక్కువ ఓట్లు పోల్ అయ్యాయన్న మాట. కనుక మధ్యాహ్నం 11-12 గంటల లోపే ఫలితం వెలువడే అవకాశం ఉంది. సర్వేల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ స్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది.