నేడే హైదరాబాద్‌లో టిఆర్ఎస్‌ ప్లీనరీ

టిఆర్ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేడు హైదరాబాద్‌, మాదాపూర్ వద్ద గల హెచ్‌ఐసీసీలో నేడు టిఆర్ఎస్‌ ప్లీనరీ సభ జరుగనుంది. వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ఇవాళ్ళ ఒక్కరోజే ప్లీనరీ సభ నిర్వహించాలని టిఆర్ఎస్‌ నిర్ణయించింది. ఈ ప్లీనరీకి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణాల పార్టీ అధ్యక్షులు, జిల్లాల లైబ్రరీ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కలిపి మొత్తం 3,000 మంది పాల్గొంటారు. 

టిఆర్ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో టిఆర్ఎస్‌ నేతలు ఉదయం 9-10 గంటల మద్య పార్టీ జెండాలు ఎగురవేస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. ఇవాళ్ళ ప్లీనరీలో 13 తీర్మానాలను ఆమోదించబోతున్నట్లు చెప్పారు. ఇవి దేశానికి దిక్సూచిగా ఉండే విదంగా రూపొందించామని తెలిపారు. 

సిఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి, మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. తరువాత అమరవీరులకు నివాళి అర్పించి తన ఉపన్యాసంతో ప్లీనరీని ప్రారంభిస్తారు. కేసీఆర్‌ ప్రసంగం ముగిసిన తరువాత 13 తీర్మానాలను ఆమోదిస్తారు.  

టిఆర్ఎస్‌ ప్లీనరీ సభ సందర్భంగా నేడు మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాలన్నీ టిఆర్ఎస్‌ ఫ్లెక్సీ బ్యానర్లతో గులాబీ మాయం అయ్యాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో  ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. ప్లీనరీ సందర్భంగా  ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.