చిల్లర రాజకీయాలు మనకొద్దు...అభివృద్ధి, సంక్షేమమే మన లక్ష్యం

సిఎం కేసీఆర్‌ మంగళవారం హైదరాబాద్‌లో మూడు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సస్ (టిమ్స్‌) హాస్పిటల్స్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆల్వాల్ హాస్పిటల్‌కు భూమి పూజ చేసిన తరువాత జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ, “పేదరికం కారణంగా రాష్ట్రంలో ఎవరూ వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉండకూడదనేది మన ప్రభుత్వం ఆశయం. రాబోయే రోజుల్లో కరోనా వంటి ఇంకా అనేక రోగాలు ప్రపంచంపై విరుచుకు పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని మనం అడ్డుకోలేము కానీ అవి వస్తే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంటే తక్కువ నష్టంతో బయటపడవచ్చు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే సుమారు 1.64 కోట్ల మంది ఉన్నారు. కనుక వారందరికీ అత్యుత్తమైన వైద్య సేవలు అందించాలంటే మరో మూడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అవసరమని భావించి నగరం నలువైపులా నాలుగు టిమ్స్‌ ఏర్పాటు చేసుకొంటున్నాము. 

ఎన్నో ఏళ్ళు కొట్లాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఏడున్నరేళ్ళలో ఎంతో ఆలోచించి, ఎంతో శ్రమించి  అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నాము. అభివృద్ధి చెందిన మన తెలంగాణ రాష్ట్రంపై ఇప్పుడు కొన్ని రాజకీయ శక్తుల కన్నువేసి కులం,మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. కానీ మనం అటువంటి వాటికి దూరంగా ఉన్నప్పుడే మన తెలంగాణను కాపాడుకొని అభివృద్ధిపదంలో ముందుకు తీసుకుపోగలము. 

ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే రూ.2.30 లక్షల కోట్లు పెట్టుబడులతో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు వగైరా వచ్చాయి. వాటితో సుమారు 10-15 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. జీనోమ్ వ్యాలీలో తయారవుతున్న టీకాలతో హైదరాబాద్‌ యావత్ ప్రపంచానికే వాక్సిన్ రాజధానిగా మారబోతోంది. ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా ఇంత వేగంగా అభివృద్ధి జరుగలేదు. నేటికీ అక్కడ రైతులు ఏదో ఓ సమస్యలతో రోడ్లెక్కవలసి వస్తోంది. కనుక మనం చిల్లర రాజకీయాలకు, కులమత రాజకీయాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిపోవాలి,” అని అన్నారు.