
పవిత్ర రంజాన్ ముగింపు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏటా ముస్లిం పెద్దలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇస్తుంటుంది. ఆ కార్యక్రమంలో సిఎం కేసీఆర్, మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొంటారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ఈనెల 29న ఎల్బీ స్టేడియంలో ముస్లిం పెద్దలకు ఇఫ్తార్ విందు ఇవ్వబోతోంది. దీనికి సంబందించిన ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై ఆయన నిన్న మంత్రి కొప్పుల, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఇంతియాజ్, జిల్లా మైనార్టీ అధికారి ఖాసిం తదితరులతో సమావేశమై చర్చించారు. ఇప్పటికే స్టేడియంలో వేదిక నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సిఎం కేసీఆర్ పాల్గొనబోతున్నందున ఆరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం చేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడకపోయినా, ఈవిదంగా ఓ పక్క మజ్లీస్‌తో సిఎం కేసీఆర్ దోస్తీ నిభాయిస్తూ, మరోపక్క హిందూదేవాలయాలను దర్శించి పూజలు, యాగాలు చేస్తూ హిందువులను ఆకర్షిస్తుండటం చాలా గొప్ప విషయమే. ఇది సిఎం కేసీఆర్ లౌకికవాదానికి నిదర్శనమని టిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నప్పటికీ, హిందూ, ముస్లిం ఓటు బ్యాంకులను కాపాడుకొనే ప్రయత్నంగా చెప్పవచ్చు. కాంగ్రెస్, తదితర పార్టీలలో కూడా ముస్లిం నేతలు చాలా మందే ఉన్నప్పటికీ, ఈ ఇఫ్తార్ విందులో ప్రధానంగా మజ్లీస్ అధినేతలకే సిఎం కేసీఆర్ ప్రాధ్యానత ఇవ్వడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.