మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి హైకోర్టు నోటీస్ జారీ చేసింది. ఆయనతో పాటు టిఆర్ఎస్‌ నేత ప్రసన్న కృష్ణకి, రాష్ట్ర హోంశాఖకు, ఖమ్మం పోలీస్ కమీషనర్‌కి, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి, సీఐ సర్వయ్యలకి కూడా హైకోర్టు నోటీసులు పంపింది. మహబూబ్‌నగర్‌కు చెందిన లాయర్ కృష్ణయ్య ఈ కేసుపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ శుక్రవారం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొనబడిన వారందరూ ఈ నెల 29లోగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులలో పేర్కొంది. 

లాయర్ కృష్ణయ్య వేసిన పిటిషన్‌లో మంత్రి పువ్వాడ ఒత్తిడి మేరకు పోలీసులు సాయి గణేశ్‌పై 10 అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని ఆరోపించారు. సాయి గణేశ్ మంత్రి అవినీతిని ప్రశ్నిస్తునందునే ఆయన కక్ష కట్టి పోలీసుల ద్వారా వేధించారని, ఇదే విషయం సాయి గణేశ్ చనిపోయే ముందు మరణ వాంగ్మూలంలో కూడా పేర్కొన్నాడని, కానీ పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదని లాయర్ కృష్ణయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులపై మంత్రి ఒత్తిళ్ళు ఉన్నందున ఈ కేసుపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు.