
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలలో మంచినీరు కలుషితం కాకుండా ఉండేందుకు 1996, మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో నంబర్: 111 జారీ చేసింది. దాని ప్రకారం కాలుష్య నివారణ కొరకు 84 గ్రామాలలో అనేక నిబందనలు, ఆంక్షలు అమలులో ఉన్నాయి. వాటన్నిటినీ ఎత్తివేస్తూ కొన్ని షరతులతో కూడిన జీవో(నంబర్ 69)ని రాష్ట్ర ప్రభుత్వం బుదవారం సాయంత్రం జారీ చేసింది.
దాని ప్రకారం శంషాబాద్ మండలంలో 47, మొయినాబాద్ మండలంలో 20, చేవెళ్ళ మండలంలో 6, రాజేంద్రనగర్, శంకరపల్లి మండలాలో చెరో 3 గ్రామాలు, కొత్తూరులో ఒకటి, రాజేంద్రనగర్, షాబాద్ పరిధిలో చెరో 2 గ్రామాలు కలిపి మొత్తం 84 గ్రామాలలో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రెండు జలశయాలలో నీటి కాలుష్యాన్ని, ఆ ప్రాంతాలలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలు రూపొందిస్తుంది. వాటి ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్: 111ను రద్దు చేస్తుంది.
అయితే ఆ ప్రాంతాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి కనుక టిఆర్ఎస్ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది కలిగించేందుకే ప్రభుత్వం జీవో నంబర్: 111ను రద్దు చేసేందుకు సిద్దపడుతోందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపై పర్యావరణవేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన చుట్టుపక్కల భవన నిర్మాణాలు పెరిగి పర్యావరణం దెబ్బ తింటుందని, రెండు జలాశయాలు పూర్తిగా కలుషితమవుతాయని వాదిస్తున్నారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.