ఓవైసీలను ప్రసన్నం చేసుకోవడానికే బిజెపిపై విమర్శలు

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం పాతబస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన సందర్భంగా, “నగరంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిచేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తానని హెచ్చరించడంపై బిజెపి సీనియర్ నేత కే.లక్ష్మణ్ ధీటుగా స్పందించారు. 

హైదరాబాద్‌ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి కేటీఆర్‌ మజ్లీస్ అధినేతలు ఓవైసీలను  ప్రసన్నం చేసుకొనేందుకు ఆవిదంగా మాట్లాడారు. ముస్లింల ఓట్ల కోసం టిఆర్ఎస్‌ పార్టీ మజ్లీస్‌కు గులాంగిరీ చేస్తోంది. పాతబస్తీలో విద్యుత్‌, నీటి బిల్లులు చెల్లించకుండా వేలకోట్లు బకాయిపడినా వసూలు చేసే ధైర్యం లేదు. పాతబస్తీలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌పై మజ్లీస్‌ నేతలు చేయి చేసుకొంటే పట్టించుకోరు. ఓవైసీలు హిందువులను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటే పట్టించుకోరు. 

పైగా ఓవైసీలను ప్రసన్నం చేసుకొనేందుకు, సిఎం కేసీఆర్‌ హిందువులను కించపరుస్తూ హిందూగాళ్ళు, బొందూగాళ్ళు అంటూ చులకనగా మాట్లాడుతారు. సిఎం కేసీఆర్‌ ఏనాడూ భద్రాచలం శ్రీరాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించలేదు. నగరంలో హనుమాన్ శోభయాత్ర చేస్తే పట్టించుకోరు. ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి మందిరంవైపు కన్నెత్తి చూడరు. బైంసాలో హిందువులపై దాడులు జరిగితే నోరు విప్పరు. ఎందుకంటే ముస్లిం ఓట్ల కోసం, మజ్లీస్‌కు ప్రాపకం కోసమే. 

ఈవిదంగా ముస్లిం ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తున్న టిఆర్ఎస్‌ పార్టీ మేము మత రాజకీయాలు చేస్తున్నామని విమర్శిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. హిందువుల అంతుచూస్తామని బెదిరిస్తున్న మజ్లీస్‌ నేతలతో సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ అంటకాగుతూ వారిని ప్రసన్నం చేసుకోవడానికి లౌకికవాదం పేరుతో హిందులను కించపరుస్తుంటే చూస్తూ సహించేది లేదు,” అంటూ కే.లక్ష్మణ్ ఘాటుగా జవాబు ఇచ్చారు.