కేసీఆర్‌ చేతికి ఎముక లేదు: సిజెఐ ఎన్వీ రమణ

తెలంగాణ సిఎం కేసీఆర్‌ చేతికి ఎముక లేదని, ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంశలతో ముంచెత్తారు. 

ఈరోజు గచ్చిబౌలిలో న్యాయాధికారుల సదస్సులో ఆయనతో పాటు సిఎం కేసీఆర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, “చేతికి ఎముక లేదని అంటుంటారు. దానికి ట్రేడ్ మార్క్ సిఎం కేసీఆరే. దేశంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను ఏవిదంగా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటాయి. కానీ సిఎం కేసీఆర్‌ మాత్రం ఒక్క తెలంగాణ న్యాయవ్యవస్థలోనే 4,320కి పైగా ఉద్యోగాలు సృష్టించారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదించగానే వెంటనే తాత్కాలిక భవనం కేటాయించడమే కాకుండా ఇక్కడ గచ్చిబౌలిలో శ్వాసిత భవనం కూడా నిర్మిస్తున్నారు. దీనికి చాలా మంచి స్పందన వస్తుండటంతో మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వద్ద ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. 

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాము. ఇకపై జిల్లా కోర్టులలో జడ్జీల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నాను. కేసులు త్వరితగతిని పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు సిఎం కేసీఆర్‌ అన్ని విధాలా తోడ్పడుతున్నారు,” అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంశించారు.  

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “మన తెలుగువారి ముద్దు బిడ్డ, జస్టిస్ ఎన్వీ రమణ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల సమస్యల పరిష్కారానికి చాలా తోడ్పడుతున్నారు. ఈ సమస్యలపై మేము కేంద్రప్రభుత్వానికి ఎన్ని లేఖలు వ్రాసినప్పటికీ పట్టించుకోలేదు. కానీ జస్టిస్ ఎన్వీ రమణ చొరవ తీసుకొని ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నారు. హైకోర్టులో 24 బెంచీలు ఉండగా వాటిని ఆయన 42కి పెంచారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున జస్టిస్ ఎన్వీ రమణగారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. తెలంగాణ న్యాయవ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలవాలని నేను కోరుకొంటున్నాను,” అని అన్నారు.