
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న రెండో విడత ప్రజా సంగ్రామయాత్రపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ ద్వారా చాలా ఘాటుగా స్పందించారు. “తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పటికీ స్పందించని బండి సంజయ్‌కి రాష్ట్రంలో పాదయాత్ర చేసే నైతిక హక్కేలేదు. బిజెపి ఓ జూటా, దగాకోర్ పార్టీ. బండి సంజయ్ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదు. ప్రజా వంచన యాత్ర. రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకొంటే బాగుంటుంది. అక్కడ కేంద్రప్రభుత్వం, ఇక్కడ బిజెపి రెండూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి.
విభజన హామీలు అమలుచేయకుండా, ప్రాజెక్టులు, నిధులు ఇవ్వకుండా తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్ష చూపిస్తుంటే బండి సంజయ్‌కి వాటి గురించి కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం రెండూ లేవు. పైగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కి ఇస్తుంటే, మోటర్లకు మీటర్లు బిగించమని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రప్రభుత్వం, బండి సంజయ్ తొండాటలు ఆడుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలను, రైతులను మాయమాటలతో మోసం చేస్తున్న మీకు ధాన్యం కొనుగోలు చేయమని అడిగినప్పుడు కనబడని బిజెపి నేతలు ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టగానే ఊళ్ళపై మిడతల దందులా వాలిపోయి, ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలను అన్యాయం, మోసం చేస్తున్నందుకు బండి సంజయ్ మోకాళ్ళపై యాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మీకు ప్రజలే తగినవిదంగా బుద్ధి చెపుతారు,” అని ఆ లేఖ సారాంశం.