వి.హనుమంతరావు కారుపై దాడి

మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు వి.హనుమంతరావు కారుపై బుదవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఆయన ఇంటి ముందు నిలిపి ఉన్న కారుపై రాళ్ళతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వి.హనుమంతరావు స్పందిస్తూ, “నేను ఇటువంటి దాడులకు భయపడను. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాను. ఇదివరకు కూడా నాకు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు నేను డిజిపిని కలిసి ఫిర్యాదు చేశాను కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు నా ఇంటిపై దాడి జరిగింది. కనీసం ఇప్పుడైనా పోలీసులు స్పందించి ఈ దాడికి పాల్పడినవారిని కనుగొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షుడినైన నాకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతే ఎలా?వారికి బాధ్యత లేదా?” అని ప్రశ్నించారు. సమాచారం అందుకొన్న పోలీసులు వి.హనుమంతరావు ఇంటికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరా రికార్డింగ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.