1.jpg)
నిన్నమొన్నటి వరకు కీచులాడుకొంటూ పార్టీ పరువు తీసుకొన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఢిల్లీలో రాహుల్ గాంధీ చేత మొట్టికాయలు వేయించుకొన్న తరువాత విభేధాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆయన నాయకత్వాన్ని, తీరును తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావులతో సహా పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కోదండ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
హైదరాబాద్ నగరంలో మత్తుమందులు వాడకం, విద్యుత్ ఛార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు సమస్య, జీవో 111 రద్దు తదితర అంశాలపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రధమ మహిళ అయిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని గౌరవించుకోవడం మన కనీస ధర్మం. అతిధులను, మహిళలను, పెద్దలను గౌరవించుకోవడం మన తెలంగాణ సంస్కృతి. కానీ సిఎం కేసీఆర్ మహిళా గవర్నర్‌ను అవమానిస్తూ మన తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నారు. గతంలో నరసింహన్‌ను గౌరవించిన సిఎం కేసీఆర్, ఇప్పుడు తమిళిసై సౌందరరాజన్‌ని ఎందుకు గౌరవించడం లేదు? ఆమె బిజెపికి చెందిన బీసీ వర్గానికి చెందిన మహిళ అనే కదా? మరి గతంలో సిఎం కేసీఆర్ బిజెపికి చెందిన వెంకయ్యనాయుడుతో రాసుకు పూసుకు తిరిగారు కదా? అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టిఆర్ఎస్, బిజెపిలు రెండూ కలిసి దొంగనాటకాలు ఆడుతున్నాయి. రాష్ట్రంలో ధాన్యం అంతా కొనుగోలు చేసేవరకు మేము ప్రభుత్వాన్ని విడిచిపెట్టబోము,” అని అన్నారు.