10.jpg)
తెలంగాణ వరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఈ యాసంగి సీజనులో ఎంత ధాన్యం పండితే అంతా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీల అధినేతలు చేసిన వేలకోట్ల అప్పులను మాఫీ చేస్తుంది. బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి పారిపోతున్నవారినీ ఉపేక్షిస్తుంది. ఒక్క అదానీ గ్రూప్‌క్ కేంద్రప్రభుత్వం 12 వేల కోట్లు మాఫీ చేసింది. కానీ రేయింబవళ్లు కష్టపడి పండించిన రైతన్నల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రానికి మనసొప్పదు. కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని నిరూపించేందుకే ఢిల్లీలో దీక్ష చేశాము. తెలంగాణ రైతులను కేంద్రం పట్టించుకోకపోయినా మేము కడుపులో పెట్టుకొని కాపాడుకొంటాము. ఈ యాసంగిలో రాష్ట్రంలో పండే ప్రతీ బియ్యం గింజను మేమే కొంటాము. దీని కోసం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీ వేశాము. త్వరలోనే ప్రతీ ఊరులో ధాన్యం కొనుగోలు కేంద్రం చేసి కొనుగోలు ప్రారంభిస్తాం. క్వింటాకు రూ.1960 చొప్పున చెల్లించాలని నిర్ణయించాము. ధాన్యం తాలూకు సొమ్మును నేరుగా రైతుల ఖాతాలలోనే జమా చేస్తాము. కనుక రాష్ట్రంలో రైతులు ఇంతకటే తక్కువ ధరకు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని చెప్పారు.